విద్యార్థి వీరులకు జోహార్లు - గద్దర్
విద్యార్థి వీరులకు జోహార్లు
వీరులార - మీకు జోహార్లు...
పారె నెత్తుటి పోరుల జోహార్లు..
విద్యార్థులార జోహార్లు...
వీరులారా
పొద్దు పొడిసె యాల - చదువు నేర్పె యాల
ఆటలాడుకొని - పాట పాడెటి యాల
చదివించిన తల్లి - సద్ది మూటయ్యే వేలా
తెలంగాణ తల్లి - సంకెళ్ళ తెంపనికి
జై తెలంగాణ అంటు - జెంగులోన దుంకి
కాంగ్రేసు సర్కారు కాల్పులకు ఎదురొడ్డి
తుపాకి గుండ్లకు గుండెలను చూపిన
విద్యార్థులారా - మీకు జోహార్లు
వీరులారా
నూనూగు మీసాల నూరేండ్ల బతుకులు
కన్న తల్లీ దండ్రి కలల పంటలు మీరు
భరత మాతా తల్లి భావి పౌరులు మీరు
శాస్త్రవేత్తలు మీరు సమరయోధులు మీరు
నిజమైన ప్రేమికులు - లైలా మజ్నూలు మీరు
భగత్ సింగన్నకు భళె ముద్దు తమ్ముళ్ళు
తెలంగాణ తల్లీ కన్నీళ్ళు బెట్టితె
రణం లోనా దుంకి రుణం దీర్చుకున్న
వీరులారా
మీ త్యాగం చూసి సృష్టి బిత్తరబాయె
గోదావరీ తల్లి గుండె కద్దూకుంది
కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్ళు రాల్చింది
సింగరేణి తల్లి శిగ ముడి ఇప్పింది
దండకారణ్యం మీ మెడల దండయ్యి
అడవి గోగుపూలు ఆరతీ బట్టినయి
వీరులారా
వీరత్వము చూసి - శూరత్వము చూసి
కొమరం భీం అన్న మా కొడుకులే అండు
సమ్మక్క సారక్క శభాష్ కొడుకంది
చాకలి ఐలమ్మ ముద్దాడి మురిసింది
బందగి చెయ్యెత్తి వందనం అన్నాడు
వీర తెలంగాణ పేరు నిలిపిండ్రాని
పల్లె పల్లె మీకు మల్లెలు చల్లినయి
వీరులారా
మీ చావు వార్తా విన్న మా కోడిపుంజులు
కాళ్ళకు కత్తులు కట్టుకొని దుంకినయి
మీ అరుపులు విన్న మా ల్యాగ దూడలు
కొమ్ములు అదిలించి కోడెలై లేసినయి
పాలు తాపిన పిల్లి పెంచుకున్నా కుక్క
మీ పోరు దారుల్లో పరుగులు దీసినయి
వీరులారా
మీ త్యాగమును చూసి - మీ ధైర్యమును చూసి
భద్రాది సీతమ్మ భళిరే భళి అన్నాది
కొమరెల్లి మల్లన్న కూత బెట్టినాడు
యముడాల రాజన్న శంఖం ఊదినాడు
యాదగిరి నరసింహ యుద్ధంకే సిద్ధమని
వెయి స్తంభాల గుడి జై జై అంటు
రామప్ప గుడి లేసి రణం గంటా ఊపె
వీరులారా
- గద్దర్

